నిర్మల్ పట్టణంలోని మిఠాయి దుకాణాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో గడువు ముగిసిన, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను గుర్తించారు.
జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి టి. సునీత నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో, కొన్ని దుకాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించని మిఠాయిలు, చాక్లెట్లు, ప్యాకేజింగ్ లేని ఆహార పదార్థాలు బయటపడ్డాయి.
ఆహార భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన దుకాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారి సునీత తెలిపారు. ఆహార పదార్థాలపై తయారీ, గడువు తేదీలతో కూడిన లేబుళ్లు తప్పనిసరిగా ఉండాలని ఆమె దుకాణదారులకు సూచించారు.
గడువు ముగిసిన పదార్థాలను వెంటనే తొలగించాలని, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఉత్పత్తులను విక్రయించవద్దని ఆదేశించారు. భవిష్యత్తులోనూ ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.












