రాంపల్లి సమీపంలోని గోధుమకుంట గ్రామపంచాయితీ ప్రాంగణంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని కమలానగర్ పీపుల్స్ వెల్ఫేర్ ట్రస్ట్, కుషాయిగూడ నవోదయ సంక్షేమ వేదిక మరియు కీసర సీఐటీయూ మండల కమిటీలు సంయుక్తంగా ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో మొత్తం 165 మంది పాల్గొని వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
గ్రామ నాయకులు వంగేటి పర్వత రెడ్డి, ఊటుకూరి పవన్ ఈ శిబిరాన్ని ప్రారంభించి, పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. నిరుపేదలకు కంటి శుక్లాల ఆపరేషన్లు ఉచితంగా చేయించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు.
శిబిరంలో కమలానగర్ ప్లానెట్ ఆప్టికల్స్ బృందం కంటి పరీక్షలు, దమ్మాయిగూడ మరియు సాకేత్–పద్మసాయి డెంటల్ క్లినిక్స్ బృందం దంత పరీక్షలు నిర్వహించాయి. కమలానగర్ శ్రీకర హాస్పిటల్ వైద్యులు రక్తపోటు, షుగర్, మరియు సాధారణ వైద్య పరీక్షలు చేశారు.
మొత్తం 165 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించబడ్డాయి. శిబిరంలో పాల్గొన్న రోగులకు ట్రస్ట్ తరపున ఉచితంగా మందులు పంపిణీ చేయబడ్డాయి.












