అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భైంసా ఏరియా ఆసుపత్రిలో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇది మహిళల ఆరోగ్య రక్షణలో ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నివారణలో HPV వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని, చిన్న వయస్సు బాలికలకు ఈ టీకా అందించడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న ఉచిత ఆరోగ్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. మహిళల సంక్షేమం, ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు.
ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీహెచ్ డాక్టర్ కాశినాథ్, బైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షిందే ఆనందరావు పటేల్, మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం మహిళల ఆరోగ్య రక్షణలో ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతోంది.


