: గ్రామీణ రోడ్లకు రూ.1,377 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

  • 92 నియోజకవర్గాల్లో 641 రోడ్ల పనులకు గ్రీన్ సిగ్నల్
  • 1,323.86 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం
  • పల్లెదారుల్లో ప్రయాణం సాఫీగా సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

 

రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేసింది. మంత్రి సీతక్క చొరవతో 92 నియోజకవర్గాల్లో 641 పనుల కోసం రూ.1,377 కోట్లు మంజూరు చేశారు. 1,323.86 కిలోమీటర్ల మేర కొత్త రోడ్ల నిర్మాణం ప్రారంభమవుతోంది. ఈ నిధులు పల్లె రహదారుల రవాణా సౌకర్యాలను మెరుగుపరచి, ప్రజలకు సులువైన రాకపోకలను కల్పించనున్నాయి.

 

రాష్ట్రంలోని గ్రామీణ రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం రూ.1,377 కోట్లు మంజూరు చేసింది. వర్షాకాలంలో రహదారులు నీటితో నిండిపోయి రవాణా ఇబ్బందులు ఎదుర్కొనే గ్రామాల్లో సులువైన రాకపోకలను కల్పించేందుకు, సురక్షితంగా రోడ్ల నిర్మాణానికి ప్రత్యేక చర్యలు చేపడుతోంది. మంత్రి సీతక్క ప్రత్యేక చొరవతో 92 నియోజకవర్గాల్లో 641 రోడ్ల పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,323.86 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించబడనున్నాయి.

గ్రామీణ ప్రజల రవాణా సౌకర్యాలు మెరుగుపర్చడంతో పాటు, పల్లె ప్రగతిని వేగవంతం చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఇటీవల మంత్రి సీతక్క సీఎంతో చర్చలు జరిపి, నిధుల కేటాయింపుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ రోడ్ల అభివృద్ధికి తగినన్ని నిధులు కేటాయించకపోవడంతో, ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రస్తుతం ఉన్న రోడ్లను మెరుగుపర్చే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. సీఆర్ఆర్ రోడ్ల కోసం మరో రెండు మూడు రోజుల్లో రూ.400 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు.

Leave a Comment