రైతు భరోసా కోసం రైతన్న ఎదురుచూపులు
పెట్టుబడి సహాయం అందించి బాసటగా నిలవాలని రైతుల వేడుకోలు
మనోరంజని తెలుగు టైమ్స్ ముధోల్, నవంబర్ 14:
రబీ సీజన్ ప్రారంభంతో రైతులు విత్తనాలు విత్తడం ప్రారంభించినప్పటికీ, నష్టాల బారిన పడిన ఖరీఫ్ సీజన్ రైతన్నను ఇంకా వెంటాడుతూనే ఉంది. గత ఖరీఫ్‌లో మండలంతో పాటు పరిసర గ్రామాల్లో విస్తారంగా పంటలు నీటిలో మునిగిపోయి భారీ నష్టం వాటిల్లింది. వరదలు తాకని పొలాల్లో కూడా వాతావరణ ప్రతికూలతలతో దిగుబడి పెట్టుబడికి కూడా సరిపోని పరిస్థితి నెలకొంది. ఇదే నష్టం నుంచి కోలుకోవాలనుకున్న రైతులకు ఇటీవల కురిసిన వర్షాలు మరో దెబ్బగా మారాయి. రబీ పంట కోసం సిద్ధం చేసుకున్న భూములు మళ్లీ తడిసిపోయాయి. రబీ సాగు సీజన్ మించిపోయినా పెట్టుబడి లేకపోయినా రైతులు అప్పులు చేసి విత్తనాలు విత్తక తప్పని పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ నష్ట పరిహారం ఇప్పటికీ అందకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. కనీసం పెట్టుబడి సహాయం అయిన రైతు భరోసా త్వరగా చేరుతుందేమోనని రైతన్న వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. రైతు భరోసా విడుదలలో ప్రభుత్వం ఆలస్యం చేయడం పట్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టాల బారిన పడిన ఈ సమయంలో పెట్టుబడి సహాయం అత్యవసరమని, ఇప్పటికైనా రైతు భరోసాను విడుదల చేసి ప్రభుత్వం బాసటగా నిలవాలని రైతులు కోరుతున్నారు.