తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) ఆధ్వర్యంలో ఏప్రిల్ 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీపీటీఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేష్ పిలుపునిచ్చారు.
నిజామాబాద్ సౌత్ మండల కేంద్రంలో కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యాభిమానులు పెద్ద ఎత్తున హాజరుకావాలని కోరారు.
“సమరశీలతత్వాన్ని చాటుకుందాం – విద్యా సమానత్వం సాధిద్దాం” అనే నినాదంతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యారంగ, సామాజిక సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటాలను ఆయన ప్రస్తావించారు.
ప్రతి ఒక్కరికీ నాణ్యమైన, ఉచిత, సమాన విద్య అందించడం ప్రభుత్వ బాధ్యత అని, “కామన్ స్కూల్ విధానం” అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యా హక్కుల సాధన కోసం సమగ్ర ఉద్యమాన్ని నిర్మించడమే టీపీటీఎఫ్ లక్ష్యమని వెల్లడించారు.
ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి డాక్టర్ కె. నవీన్ నికోల, గౌరవ అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం హాజరుకానున్నారు. పలువురు ప్రముఖులు విద్యా సంబంధిత అంశాలపై ప్రసంగించనున్నారు.












