“ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” సంక్షేమ వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, డ్యాంగాపూర్ ప్రభుత్వ బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, తల్లిదండ్రులు, పోషకులు పాఠశాల నిర్వహించే సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. దీనివల్ల విద్యార్థుల విద్యా ప్రగతిని తెలుసుకోవచ్చని, ఉపాధ్యాయులు, అధికారులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేస్తే విద్యార్థుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
విద్యార్థులు సెలవులు ముగిసిన వెంటనే పాఠశాలకు హాజరుకావాలని, తల్లిదండ్రులు కూడా దీనిపై దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం, తాగునీటి కోసం బోరు బావి తవ్వకం వంటి సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కామన్ మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రతిభ కనబరుస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను శాలువాలతో సత్కరించి, బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిటిడిఓ అంబాజీ, డీఈవో భోజన్న, సిపిఓ జీవరత్నం, తహసీల్దార్ ప్రభాకర్, ప్రధానోపాధ్యాయురాలు శైలజ, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్లు నవీన్, హరీష్, ఇతర అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.











