తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో నిర్మల్ జిల్లా విద్యార్థులు పలు విభాగాల్లో విజయాలు సాధించారు.
రాష్ట్ర విద్యాశాఖ (సమగ్ర శిక్ష) ఆధ్వర్యంలో ఫిబ్రవరి 17న హైదరాబాద్‌లోని ప్రభుత్వ కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, దోమలగూడలో దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు – 2026 జరిగాయి. ఈ పోటీలకు నిర్మల్ జిల్లా నుండి 9 మంది విద్యార్థులు (7 బాలురు, 2 బాలికలు) హాజరయ్యారు.
జూనియర్, సీనియర్ విభాగాలలో విద్యార్థులు రన్నింగ్, షాట్ పుట్, లాంగ్ జంప్, క్యారమ్, స్లో వాకింగ్ వంటి వివిధ క్రీడల్లో పాల్గొన్నారు. విద్యార్థుల వైకల్య స్థాయిలను పరిగణనలోకి తీసుకుని పోటీలు నిర్వహించారు.
భైంసా కస్తూరిబా గాంధీ విద్యాలయానికి చెందిన సుమయ్య బేగం క్యారమ్, స్పీడ్ వాకింగ్‌లో ప్రథమ స్థానాలు, జె. శివాని 50 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ, క్యారమ్‌లో తృతీయ స్థానాలు గెలుచుకున్నారు. జూనియర్ బాలుర విభాగంలో సుశాంత్ షాట్ పుట్, లాంగ్ జంప్‌లో ప్రథమ స్థానాలు, హర్షిత్ క్యారమ్‌లో తృతీయ స్థానం సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో గణేష్ షాట్ పుట్, లాంగ్ జంప్‌లో ద్వితీయ స్థానాలు పొందారు.
విజేతలకు తెలంగాణ విద్యాశాఖ డైరెక్టర్ డా. ఈ. నవీన్ నికోలస్, సంయుక్త సంచాలకురాలు వెంకట నర్సమ్మ బహుమతులు అందజేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న విజేతలను అభినందించారు. దివ్యాంగ విద్యార్థులకు భవిష్యత్తులో మరింత ప్రోత్సాహం అందిస్తామని అధికారులు తెలిపారు.

