ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా టాపర్లుగా నిలిచిన పీఎం శ్రీ మోడల్ స్కూల్ అండ్ కాలేజ్, కుంటాల విద్యార్థినులను నిర్మల్ జిల్లా కలెక్టర్ బవేష్ మిశ్రా, డీఈఓ భోజన్న ఘనంగా సన్మానించి, నగదు బహుమతులు అందజేశారు.
ఎంపీసీ విభాగంలో పుల్లోళ్ల గనుశ్రీ, ఎంఈసీ విభాగంలో జి. శృతి తాయి, సీఈసీ విభాగంలో సల్లవాడ వైష్ణవి అత్యధిక మార్కులు సాధించి జిల్లా టాపర్లుగా నిలిచారు. వీరికి రూ.10 వేల చొప్పున నగదు బహుమతులు, ప్రోత్సాహకాలు అందించారు.
విద్యార్థినుల ప్రతిభ కళాశాలకు గర్వకారణమని అధ్యాపకులు తెలిపారు. విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారంతోనే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వారు పేర్కొన్నారు.
జిల్లా స్థాయిలో సన్మానం పొందిన విద్యార్థినులను అధికారులు అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎత్రాజ్ రాజు, ఉపాధ్యాయులు భూమన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.










