బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం 'బడి పిలుస్తోంది' కార్యక్రమంలో భాగంగా వెల్దుర్తి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను చేర్పించే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
కలెక్టర్ ఇంటింటికి వెళ్లి విద్యార్థులను, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడుల్లో లభించే నాణ్యమైన విద్య, వసతులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుండి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలను వంద శాతం చేర్పించాలని అధికారులకు సూచించారు.
విద్యార్థుల నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని, తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను వివరించి, వారి పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.
కలెక్టర్ 5వ తరగతి పూర్తి చేసుకుని 6వ తరగతికి వెళ్తున్న విద్యార్థులతో మాట్లాడుతూ, ప్రతిరోజూ డిక్షనరీ నుండి కొత్త ఐదు ఆంగ్ల పదాలను నేర్చుకోవాలని, వార్తాపత్రికలు, కథల పుస్తకాలు చదవాలని సూచించారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు బయట తిరగకూడదని, ఎక్కువ నీరు తాగాలని సూచించారు.











