నిర్మల్ అర్బన్ మండలం సోఫీనగర్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో నిర్వహించిన విద్యా వారోత్సవాల్లో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆయన సూచించారు.
“ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ విద్యా వారోత్సవాల్లో కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన కళలు, హస్తకళలు, సాంస్కృతిక ప్రదర్శనలను ఆయన పరిశీలించి అభినందించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రస్తుత కాలంలో విద్యతో పాటు కళలు, సాంస్కృతిక రంగాల్లోనూ విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
సెల్ఫోన్లకు దూరంగా ఉంటూ కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టి సారించాలని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ రాజు, ఎంఈఓ పద్మ, పాఠశాల ప్రిన్సిపల్ డానియల్, అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.












