మెండోరా మండలంలోని దూదిగాం గ్రామానికి చెందిన 33 మంది ఎస్ఎస్సీ విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడంతో వారిని గ్రామ సర్పంచ్ హరోన్ రషీద్ బాబా ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శాలువాలు, మెమెంటోలు అందజేశారు.
గ్రామ సర్పంచ్ హరోన్ రషీద్ బాబా మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి, దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. దేశసేవ లక్ష్యంగా ముందుకు సాగుతూ తమ భవిష్యత్తును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఎస్ఎస్సీ పరీక్షల్లో ఒడ్డం భువనశ్రీ (580 మార్కులు), శెట్టిపల్లి లాస్య (558 మార్కులు) వంటి విద్యార్థులు మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి గౌరవం తెచ్చారని ఆయన అభినందించారు. మొత్తం 33 మంది విద్యార్థిని, విద్యార్థులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ రాజశేఖర్, ఉపసర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ విలేజ్ కమిటీ సభ్యులు, యువతీ యువకులు, మహిళలు పాల్గొన్నారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.








