మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించి, భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని జిల్లా న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి విద్యార్థులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాల రజతోత్సవాల్లో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ కళాశాల రజతోత్సవాలు దివ్య గార్డెన్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయమూర్తి శ్రీమతి శ్రీవాణి, కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్, కరస్పాండెంట్ ఎన్.ఆర్. సర్వోత్తమ్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ అఖిలేష్ కుమార్ సింగ్, పురపాలక సంఘం చైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తిలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ, విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ, నైతిక విలువలు, నిరంతర శ్రమతో సాధన చేస్తే ఏ రంగంలోనైనా రాణించడం సులభమవుతుందని తెలిపారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత స్థాయిలో నిలబడాలని ఆమె విద్యార్థులకు సూచించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని ఆమె కోరారు. ఉన్నతమైన లక్ష్యాలను ఎన్నుకొని, అందుకు అనుగుణంగా చదువుకొని ఉన్నత స్థాయిలో నిలబడాలని ఆమె పేర్కొన్నారు. సమాజం పట్ల అవగాహన, సామాజిక దృక్పథం, దేశభక్తిని పెంపొందించుకోవాలని, ఇష్టమైన రంగాల్లో ప్రతిభను మెరుగుపరుచుకుంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని ఆమె తెలిపారు.
2001లో స్థాపించబడిన వశిష్ట కళాశాల 25 సంవత్సరాలుగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు మార్గదర్శనం చేసిందని న్యాయమూర్తి ప్రశంసించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల అంకితభావం అందరికీ ఆదర్శమని అన్నారు. కళాశాల డైరెక్టర్ వి. సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ, కళాశాల విజయానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పూర్వ విద్యార్థులు తమ అనుభవాలను పంచుకొని కళాశాల గొప్పతనాన్ని వివరించారు.








