రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలి : డాక్టర్ ఎర్ర దామోదర్ రెడ్డి
మనోరంజని తెలుగు టైమ్స్ – భైంసా, నవంబర్ 14:
డాక్టర్లు రోగులకు ఉత్తమ సేవలు అందించినప్పుడే, వారి పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎర్ర దామోదర్ రెడ్డి అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం భైంసా పట్టణంలోని జి.డి.ఆర్ మెమోరియల్ కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బాలల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ—
“వైద్యో నారాయణో హరిః… ఈ సమాజం డాక్టర్లను దేవుడితో సమానంగా భావిస్తుంది. ఇంతటి బాధ్యత ఉన్న వైద్యులు రోగులకు అందుబాటులో ఉండి, వైద్యసేవలతో పాటు మనోధైర్యం అందించినప్పుడే రోగుల సగం వ్యాధి నయమవుతుంది” అని డాక్టర్ దామోదర్ రెడ్డి అన్నారు. ఉచిత శిబిరంలో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్ జాదవ్ చిన్నారులకు వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో ఆసుపత్రి ప్రోప్రైటర్ డాక్టర్ దీప జాదవ్, డాక్టర్ సూర్య వంశీ ఉమాకాంత్, డాక్టర్ రచన, మేనేజర్ జాధవ్ పుండలిక్ రావు పాటిల్, పీఆర్ఓ పి. సాయినాథ్, నర్సులు, కాంపౌండర్లు తదితరులు పాల్గొన్నారు.