బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలు పురోగతిని ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ముందుగా అమ్మవారిని దర్శించుకుని, అనంతరం ఆలయ ప్రాంగణం, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం, వ్యాస గుహ వంటి ప్రాంతాలను సందర్శించారు. మాస్టర్ ప్లాన్ అమలుకు సంబంధించిన వివిధ అంశాలపై అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా కమిషనర్ హనుమంతరావు మాట్లాడుతూ, 225 కోట్ల రూపాయల వ్యయంతో బాసర ఆలయాన్ని ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మాస్టర్ ప్లాన్ అమలుతో ఆలయ రూపురేఖలు మారతాయని, భక్తులకు మెరుగైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆగమ శాస్త్ర నియమాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధికి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారని, మాస్టర్ ప్లాన్ అమలు ద్వారా ఆలయం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు. భక్తులకు సకల సౌకర్యాలతో నిర్మాణం జరుగుతుందని, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు కూడా తగిన ఏర్పాట్లు చేస్తామని వివరించారు.
ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఏఎస్పీ సాయికిరణ్, ఆలయ ఈవో అంజనా దేవి, తహసిల్దార్ పవన్ చంద్రతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.












