భారతదేశంలో అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర 2026కు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 28న ముగుస్తుంది. ఈ యాత్ర 57 రోజుల పాటు కొనసాగనుంది.
లక్షలాది మంది భక్తులు మంచు శివలింగ దర్శనం కోసం ఈ యాత్రలో పాల్గొంటారు. రిజిస్ట్రేషన్లు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 550కి పైగా ఎంపిక చేసిన బ్యాంక్ శాఖల్లో ఈ సదుపాయం కల్పించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటివి రిజిస్ట్రేషన్ కేంద్రాలుగా వ్యవహరిస్తాయి.
శ్రీ అమర్నాథ్ జీ శ్రైన్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా భక్తులు దరఖాస్తు చేసుకోవచ్చు. యాత్రకు హాజరయ్యే ప్రతి భక్తుడికి ఆరోగ్య ధృవీకరణ పత్రం తప్పనిసరి. భక్తుల భద్రత కోసం ఆర్ఎఫ్ఐడీ ట్రాకింగ్ వ్యవస్థతో పాటుగా రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందిస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసుకునే విధానంలో భాగంగా, భక్తులు దరఖాస్తు ఫామ్ నింపి, అవసరమైన వ్యక్తిగత వివరాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, గుర్తింపు కార్డును జత చేయాలి. ఏప్రిల్ 8వ తేదీ తర్వాత గుర్తింపు పొందిన వైద్యుల నుంచి తీసుకున్న ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఆన్లైన్ దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి, రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి. ఆఫ్లైన్ దరఖాస్తుదారులు బ్యాంకులో నేరుగా ఫీజు చెల్లించి రసీదు పొందాలి.












