జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డా.జి.జానకి షర్మిల అధ్యక్షతన జరిగిన డిస్ట్రిక్ట్ ప్రాసిక్యూటర్ రివ్యూ కమిటీ సమావేశంలో, నేరస్తులకు శిక్షలు ఖరారు అయ్యేలా దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచాలని, కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పాల్గొన్నారు. తీవ్రమైన కేసులలో కోర్టుల నుండి వచ్చిన నిర్దోషుల తీర్పులపై సమగ్ర సమీక్ష చేపట్టారు. కేసులు నిర్దోషులుగా విడుదల కావడానికి గల కారణాలు, దర్యాప్తులోని లోపాలు, సాక్ష్యాధారాల సమర్పణలో సమస్యలు, సాక్షుల హాజరు, ప్రాసిక్యూషన్ నిర్వహణ వంటి అంశాలపై లోతుగా చర్చించారు.
అదనంగా, సంబంధిత కేసులలో అప్పీల్‌కు వెళ్లే అవకాశాలపై న్యాయపరమైన అంశాలను పరిశీలించి, అవసరమైన చోట తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. భవిష్యత్తులో ఇలాంటి కేసులలో బలమైన సాక్ష్యాధారాలు సమర్పించేందుకు దర్యాప్తు అధికారులు, ప్రాసిక్యూషన్ మధ్య సమన్వయం పెంపొందించాలని ఎస్పీ సూచించారు.
నేరస్తులకు శిక్షలు ఖరారు అయ్యేలా దర్యాప్తు నాణ్యతను మరింత మెరుగుపరచడం, కోర్టు విచారణలో సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఎస్పీ స్పష్టం చేశారు. జిల్లాలో న్యాయవ్యవస్థతో సమన్వయం పెంచి, బాధితులకు న్యాయం అందేలా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.
సమావేశం అనంతరం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చేసిన సేవలను గుర్తించి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సుదర్శన్ రెడ్డి, సతీష్, అరుణ, దేవేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఎస్ఐలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.


