ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తిని పెళ్లి మండపంలో గుర్తించలేకపోయిన వధువు, అతడిని తిరస్కరించడంతో పాటు, అతనిపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో వరుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
పోలీసుల కథనం ప్రకారం, హర్దోయ్‌కు చెందిన ఓ యువతి 'రాహుల్ మిశ్రా' అనే పేరుతో సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. ఫోన్ కాల్స్, వీడియో చాటింగ్‌ల ద్వారా వారి మధ్య అనుబంధం బలపడింది. చివరకు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలకు సమాచారం ఇచ్చారు.
మే 12న, యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి సిద్ధమయ్యారు. 23 ఏళ్ల దేవేంద్ర సింగ్ పరిమార్ అనే యువకుడు వరుడిగా తన కుటుంబ సభ్యులతో కలిసి పెళ్లి ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అయితే, పెళ్లి మండపంలో వరుడి అసలు రూపాన్ని చూసిన వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఇతను కాదని, తాను మోసపోయానని ఆరోపిస్తూ పెళ్లికి నిరాకరించింది.
సోషల్ మీడియాలో ఫిల్టర్లు, ఎడిట్ చేసిన ఫోటోల కారణంగా తాను మోసపోయానని వధువు ఆరోపించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి గురైన వధువు బంధువులు వరుడిపై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. వరుడిపై దాడి చేసిన తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా పరిచయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు.












