అనంతపురంలో సీనియర్ దళిత జర్నలిస్ట్ కొత్తూరు లక్ష్మీనారాయణపై శ్రీ గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయర్, ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు ఇంట్లోకి చొరబడి తీవ్రంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు.
దళిత సీనియర్ జర్నలిస్ట్ కొత్తూరు లక్ష్మీనారాయణపై శ్రీ గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయర్, ఆమె తండ్రి, 10 మంది గుండాలు కలిసి ఇంట్లోకి చొరబడి దాడి చేశారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దాడిలో లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన కంటికి గాయం అయినట్లు సమాచారం.
దాడి సమయంలో లక్ష్మీనారాయణను కులం పేరుతో దూషిస్తూ, 'మాదిగ నా కొడకా, కాళ్లు పట్టుకుంటావా చచ్చిపోతావా?' అంటూ అవమానించారని, పిడిగుద్దులతో పాటు మారణాయుధాలతో కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. ఆయన భార్యను, మైనర్ దత్తపుత్రుడిని కూడా కొట్టారని పేర్కొన్నారు.
ఘటన జరిగినప్పుడు లక్ష్మీనారాయణ సెల్‌ఫోన్‌ను నిందితులు దొంగిలించి, అనంతరం ఫార్మాట్ చేసి ఇచ్చినట్లు తెలిసింది. ఈ చర్య ఆధారాల నాశనానికి పాల్పడినట్లుగా భావిస్తున్నారు. ఈ విషయంపై బీఎస్పీ నాయకులు, ఇతర సంఘాల నాయకులు డి.ఐ.జి.ని కలిసి ఫిర్యాదు చేశారు. నాన్-బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
డి.ఐ.జి. ఆదేశాల మేరకు పోలీసులు సెల్‌ఫోన్‌ను రికవరీ చేసినప్పటికీ, ఫార్మాట్ చేయబడటంతో కీలక ఆధారాలు లభించలేదని తెలిసింది. ఈ దాడిని కులం ఆధారిత హింసగా, పత్రికా స్వేచ్ఛపై దాడిగా పలు సంఘాలు ఖండించాయి. నిందితుల అరెస్ట్, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.








