నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలో మద్యానికి బానిసై, ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాథోడ్ లక్ష్మణ్ (29) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సాయినగర్ తండాలో చోటు చేసుకుంది.
పోలీసుల వివరాల ప్రకారం, మృతుడు రాథోడ్ లక్ష్మణ్ కొద్ది రోజులుగా మద్యానికి బానిసై, ఎలాంటి పని చేయకుండా ఉన్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో, శుక్రవారం ఇంట్లో భార్య లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బంధువులు వెంటనే స్పందించి, 108 వాహనం ద్వారా నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
మృతుని భార్య హీరబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు.








