కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర వైన్ షాపు సమీపంలో మంగళవారం ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది.
కరీంనగర్ పట్టణానికి చెందిన కాసిన గొట్టు భారతి అనే మహిళ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. సమాచారం అందిన వెంటనే రామడుగు ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో గాయపడిన మహిళను వెంటనే కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో ఎస్ఐ రాజు మానవత్వాన్ని చాటుకున్నారు. స్ట్రెచర్‌పై ఉన్న మహిళను స్వయంగా ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లడం గమనార్హం. ప్రస్తుతం గాయపడిన మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సంఘటన జరిగిన ప్రదేశంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.








