నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జాం గ్రామ చెరువు సమీపంలో అక్రమంగా జరుగుతున్న మొరం, ఇసుక తవ్వకాలపై జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.
చెరువు పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న తవ్వకాల తీరును అధికారులు పరిశీలించి, పరిస్థితిని సమీక్షించారు. అక్రమ తవ్వకాలు, అనుమతి లేకుండా ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల అవసరాల కోసం తవ్వకాలు చేపట్టే ముందు రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని అధికారులు సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
చెరువుల పరిరక్షణతో పాటు పర్యావరణాన్ని కాపాడటం అందరి బాధ్యత అని, అక్రమ తవ్వకాల వల్ల భూగర్భ జలాలపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మైనింగ్ అధికారి హరి ప్రసాద్, తహసీల్దార్ సంధ్యారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.








