రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ ఏడాది కాలంలోనే 20 మోసాల కేసులు నమోదు చేశామని ఆయన వెల్లడించారు.
రైతులను లక్ష్యంగా చేసుకుని రుణాలు, సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు, పంటల కొనుగోలు పేరుతో మోసాలకు పాల్పడుతున్న దళారులు, కేటుగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. రైతులకు అండగా జిల్లా పోలీసు యంత్రాంగం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రైతుల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు గత ఏడాది కాలంలో రైతులను మోసం చేసిన వారిపై 25 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ ఏడాది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి కేవలం నెల రోజుల వ్యవధిలోనే 20 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
వ్యవసాయ రుణాలు ఇప్పిస్తామని, ప్రభుత్వ సబ్సిడీలు మంజూరు చేయిస్తామని, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు తక్కువ ధరకే అందిస్తామని, పంటలకు అధిక ధరలు ఇప్పిస్తామని చెప్పి ముందస్తుగా డబ్బులు వసూలు చేసే వ్యక్తుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ పథకాల పేరుతో, బ్యాంకులు లేదా ఇతర సంస్థల పేర్లతో డబ్బులు డిమాండ్ చేసినట్లయితే పూర్తిస్థాయిలో ధృవీకరించుకున్న తర్వాతే స్పందించాలని కోరారు.
అనుమానాస్పద వ్యక్తుల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. జిల్లా వ్యాప్తంగా రైతులు, ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా నిర్భయంగా పోలీసు శాఖను సంప్రదించవచ్చని, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రైతుల ఆర్థిక భద్రతకు జిల్లా పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, మోసాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.












