జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బోథ్ పోలీస్ స్టేషన్ను సందర్శించి, పోలీసు సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విధులలో క్రమశిక్షణ, సమయపాలన పాటించడంతో పాటు, మండలంలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని సూచించారు.
మంగళవారం బోథ్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్, స్టేషన్ పరిధిలోని వాహనాల నిర్వహణ, రికార్డుల నమోదు వంటి అంశాలపై సిబ్బందితో చర్చించారు. రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు.
గ్రామస్థాయిలో జరిగే ప్రతి అసాంఘిక కార్యకలాపంపై నిఘా ఉంచడానికి విపిఓ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఎస్పీ సూచించారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని, గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ముఖ్యంగా, మండలంలో గంజాయి నిర్మూలన, గుడుంబా తయారీ, ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణా, పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించాలని, బహిరంగ మద్యపానాన్ని నియంత్రించాలని సూచించారు.
పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి, చార్జిషీట్లు దాఖలు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, బోథ్ సీఐ డి. గురుస్వామి, ఎస్ఐ వి. పురుషోత్తం, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.











