లింబాద్రిగుట్ట అర్చకులపై జర్నలిస్టుల ఫిర్యాదు
వృత్తిని అవమానించిన అర్చకులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్
మనోరంజని తెలుగు టైమ్స్ భీంగల్ ప్రతినిధి నవంబర్ 06
నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రి గుట్టలో అర్చకులు విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్ట్‌ను పరుష పదజాలంతో దూషించారని, వృత్తిని అవమానించారని ఆరోపిస్తూ గురువారం భీంగల్ పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యులు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు. వారు మాట్లాడుతూ —“స్వామివారిపై భక్తి చూపడం కూడా ఒక విధంగా దేవుని సేవే. అలాంటి సందర్భంలో అర్చకులు వ్యక్తిగతంగా, వృత్తి పరంగా దూషించడం తగదు. భక్తుల సాక్షిగా క్యూ లైన్ వద్ద పరుష పదజాలం వాడారు,” అని తెలిపారు. అదేవిధంగా, అన్నదానం ప్రాంతంలో సేవ చేసే కొందరు వ్యక్తులు కూడా ఇష్టరీతిన మాట్లాడి అవమానపరుస్తున్నారని వారు పేర్కొన్నారు. రథోత్సవ సమయంలో కూడా అర్చకులు భక్తులపై చేయి చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ “అర్చకులు విధి నిర్వహణలో ఉన్న పోలీసుల మాట వినకపోవడం విచారకరం. జర్నలిస్టుల పట్ల ఇలా వ్యవహరించడం బాధాకరం. భక్తుల పట్ల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి,” అని పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎస్సై సందీప్కు ఫిర్యాదు సమర్పించిన జర్నలిస్టులు, కారణమైన అర్చకులపై తక్షణమే విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.