తండ్రి ప్రేమ, త్యాగాలను ఆవిష్కరిస్తూ యువ రచయిత ఆకాష్ కేడేవార్ రచించిన ‘నాన్న ఒక నిశ్శబ్ద సముద్రం’ పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్ర అభినందించారు. గ్రామీణ ప్రాంత యువకుడు సాహిత్య రంగంలో రాణిస్తున్నారని కలెక్టర్ కొనియాడారు.
కుంటాల మండలం లింబా (కే) గ్రామానికి చెందిన ఆకాష్ కేడేవార్ రచించిన ‘నాన్న ఒక నిశ్శబ్ద సముద్రం’ పుస్తకాన్ని ఇటీవల జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రకు అందజేశారు. పుస్తకాన్ని పరిశీలించిన కలెక్టర్, తండ్రి పాత్రను నిశ్శబ్ద త్యాగాల ప్రతిరూపంగా చిత్రీకరించిన తీరును ప్రశంసించారు.
కుటుంబ విలువలను, అనుబంధాలను ప్రతిబింబించే ఈ రచన పాఠకులను ఆలోచింపజేస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. గ్రామీణ ప్రాంత యువకుడు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆకాష్ కేడేవార్ ప్రస్తుతం ఎం.ఎస్సీ మైక్రోబయాలజీ చదువుతూనే సాహిత్యం, గానం వంటి సృజనాత్మక రంగాల్లో రాణిస్తున్నారు. చదువుతో పాటు రచనల ద్వారా సమాజానికి సందేశాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు.
కలెక్టర్ నుంచి లభించిన ప్రశంసలు తన బాధ్యతను పెంచాయని, కుటుంబ సభ్యులు, ముఖ్యంగా తండ్రి స్ఫూర్తితోనే ఈ పుస్తకం రచించానని ఆకాష్ పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని విలువలతో కూడిన రచనలు అందిస్తానని తెలిపారు.











