మహిళలు, బాలికలు తమకు ఎదురయ్యే ఎలాంటి ఆపదలనైనా ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లను సద్వినియోగం చేసుకోవాలని ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమత సూచించారు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఐసిడిఎస్ అర్బన్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ పర్యవేక్షణలో ఇస్లాంపురం సెక్టార్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల వద్ద కిశోర బాలికలు, మహిళలకు చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ శాఖ వారి 100 నంబర్ల గురించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సిడిపిఓ మమత మాట్లాడుతూ, బాలికలపై జరిగే అఘాయిత్యాలను అరికట్టేందుకు పోక్సో చట్టంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ, పిల్లలు విద్యపై శ్రద్ధ పెట్టాలని, చదువు అనేది ఏదైనా సాధించగల గొప్ప ఆయుధమని తెలిపారు.
పిల్లలకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే 1098, 100 నంబర్లకు సమాచారం అందించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె.నాగమణి, పోషణ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ టీ.కవిత, అంగన్వాడీ టీచర్లు, కిశోర బాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.








