మిర్యాలగూడ మండలం తుంగపాడు పాక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసి గురువారం ఉద్యోగ విరమణ పొందిన తాళ్ల వెంకటరెడ్డికి సహకార శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఆయన సేవలను పలువురు ప్రశంసించారు.
సహకార శాఖలో చిరుద్యోగిగా ప్రస్థానం ప్రారంభించి మూడున్నర దశాబ్దాలుగా వివిధ హోదాల్లో రైతులకు సేవలు అందించిన తాళ్ల వెంకటరెడ్డి సేవలు అభినందనీయమని సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్, పాక్స్ పర్సన్ ఇంచార్జ్ ఎస్.రామచంద్రయ్య అన్నారు. తుంగపాడు పాక్స్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా పనిచేసిన వెంకటరెడ్డి గురువారం ఉద్యోగ విరమణ పొందారు.
రైతుల సంక్షేమం కోసం సహకార శాఖ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పలు సేవలను రైతులకు అందుబాటులోకి తీసుకువచ్చి, మెరుగైన సేవలందించడంలో ఆయన నిబద్ధతను రామచంద్రయ్య కొనియాడారు. క్రమశిక్షణతో, సేవా దృక్పథంతో సంఘ పటిష్టతకు కృషి చేస్తూ, సంఘాన్ని లాభాల బాటలో నడిపించారని, దీని ద్వారా అనేక మంది రైతులు, అధికారుల మన్ననలు పొందారని తెలిపారు.
వడ్డీ రాయితీ, రుణమాఫీ, ఎరువులు, విత్తనాల విక్రయాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలను నిబద్ధతతో అందిస్తూ, అంతర్జాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి పారదర్శక సేవలు అందించడం అభినందనీయమని రామచంద్రయ్య పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పదని, అనంతరం శేష జీవితాన్ని ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో గడుపుతూ సమాజ సేవలో పాల్గొనాలని ఆయన సూచించారు.
ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెడుదూరి వెంకటరెడ్డి, మాజీ చైర్మన్ శాగం ఆదిరెడ్డి, సీసీ బ్యాంకు మేనేజర్లు కందుకూరి అలివేలు, సంధ్యారాణి, స్వేచ్ఛ భారతి, ఏపీఎం సూర్య నాయక్, లావూరి హరియా నాయక్, సూపర్వైజర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది, రైతులు పూలమాలలు, శాలువాలతో వెంకటరెడ్డిని ఘనంగా సన్మానించారు.









