ప్రొద్దుటూరులో బంధువులు ముందుకు రాకపోవడంతో, ఒంటరిగా మృతి చెందిన సూర్యవతి అనే మహిళకు 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' సభ్యులు మానవత్వాన్ని చాటుతూ హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు.
సూర్యవతి అనే మహిళ ప్రొద్దుటూరులో నివసిస్తూ మృతి చెందారు. ఆమెకు అంత్యక్రియలు నిర్వహించడానికి బంధువులు ఎవరూ అందుబాటులో లేని నేపథ్యంలో, స్థానికులు 'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్ను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి, హిందూ స్మశానవాటికలో హిందూ సంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ సుబహాన్, వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా, ఈశ్వర్ వర్ధన్ రెడ్డి, అశోక్ కుమార్ పాల్గొన్నారు.
బంధువులు లేనివారికి అండగా నిలిచి, ఇలాంటి క్లిష్ట సమయాల్లో సహాయం అందించిన ఫౌండేషన్ సభ్యుల మానవతా స్పూర్తిని స్థానికులు ప్రశంసించారు. ఇది నిజమైన మానవత్వానికి నిదర్శనమని పలువురు పేర్కొన్నారు.
'మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్' నిరంతరం ఇలాంటి సేవా కార్యక్రమాలను చేపడుతూ, అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తుందని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. శ్రీ అమ్మ శరణాలయంలోని వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 9182244150 నంబర్లలో సంప్రదించాలని కోరారు.


