జమ్మలమడుగు పట్టణంలో బంధువులు లేని వృద్ధుడి అంత్యక్రియలను ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ సభ్యులు మానవత్వంతో నిర్వహించారు. స్థానికుల అభ్యర్థన మేరకు స్పందించిన ఫౌండేషన్, హిందూ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసింది.
జమ్మలమడుగు పట్టణంలోని బెల్లల వీధిలో నివసిస్తున్న వృద్ధుడు బండి చిన్న వెంకట నారాయణ అనారోగ్యంతో మరణించారు. ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్ ను సంప్రదించారు.
సమాచారం అందిన వెంటనే ఫౌండేషన్ సభ్యులు స్పందించి, మానవత్వాన్ని చాటుతూ వృద్ధుడి అంత్యక్రియలను హిందూ సంప్రదాయం ప్రకారం స్థానిక హిందూ స్మశానవాటికలో ఘనంగా నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు, టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్, సభ్యులు సుబహన్, నరేంద్ర కుమార్, కృప అగ్ని షరోన్ ట్రస్ట్ సభ్యుడు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫౌండేషన్ సభ్యుల సకాల స్పందన, మానవతా దృక్పథం పట్ల స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో ఆదుకునే ఇలాంటి సేవా సంస్థలు సమాజానికి ఎంతో అవసరమని వారు అభిప్రాయపడ్డారు.
‘మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్’ గత కొంతకాలంగా సేవా రంగంలో చురుకుగా పాల్గొంటూ, అవసరమైన వారికి సహాయం అందిస్తోంది. ముఖ్యంగా, అనాథలు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. జమ్మలమడుగులోని మా శ్రీ అమ్మ శరణాలయంలో నివసిస్తున్న వృద్ధులకు సహాయం చేయదలచిన దాతలు 82972 53484, 9182244150 నంబర్లను సంప్రదించాలని వారు కోరుతున్నారు.


