అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్, కవయిత్రి మంజుల పత్తిపాటి మహిళల స్థితిగతులపై, వారి ఎదుగుదలకు అవసరమైన మార్పులపై లోతైన విశ్లేషణ చేశారు. నిజమైన మహిళా దినోత్సవం జరుపుకోవాలంటే, ముందుగా ఆలోచనల్లో మార్పు రావాలని ఆమె స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మంజుల పత్తిపాటి మాట్లాడుతూ, మహిళలు నిజంగా సంతోషంగా ఉన్నారా అనే దానిపై మనస్ఫూర్తిగా ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. సమాజంలో మహిళలకు మహిళలే శత్రువులుగా మారుతున్న పరిస్థితులు ఆందోళనకరమని, తోటి మహిళల బాధలను అర్థం చేసుకోలేని ధోరణి కొనసాగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో మహిళలు ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేస్తూ, కట్టెల పొయ్యిపై వంట చేయడం, వరకట్నం కోసం హింసించడం, నిండు గర్భిణీ అయినా నీళ్లు మోయడం వంటి దుర్భర పరిస్థితులను ఆమె వివరించారు. ఈ దుస్థితి మారాలంటే, మహిళా దినోత్సవం జరుపుకోవడంతో పాటు, వ్యక్తిగత ఆలోచనల్లో మార్పు రావాలని ఆమె సూచించారు.
తన జీవితానుభవాలను పంచుకుంటూ, కన్నీటి క్షణాలు కవితలుగా రూపాంతరం చెందాయని, అవి తనలో విప్లవాన్ని రగిలించాయని తెలిపారు. మహిళలకు పురుషులు మాత్రమే కాకుండా, తోటి మహిళలు కూడా అడ్డంకులుగా మారుతున్నారని ఆమె పేర్కొన్నారు. పిల్లలకు సరైన విలువలు నేర్పించకపోతే, వారు సమాజానికి హానికరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కుటుంబం, సమాజం మారాలంటే, ముందుగా మహిళ మారాలని, అప్పుడే పురుషుల ఆలోచనలు కూడా సానుకూలంగా మారుతాయని, ప్రతి రోజూ మహిళా దినోత్సవంగా మారి తీరుతుందని మంజుల పత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు.


