మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రోడ్డుపై ప్రమాదవశాత్తు ధాన్యం బస్తాలు జారి చెల్లాచెదురైన సంఘటనలో ట్రాఫిక్ పోలీసులు సకాలంలో స్పందించి రైతుకు అండగా నిలిచారు. రోడ్డుపై పడిన ధాన్యాన్ని సేకరించి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అండర్ బ్రిడ్జి వద్ద ఈ రోజు ఒక రైతు తీసుకెళ్తున్న ధాన్యం బస్తా ప్రమాదవశాత్తూ జారి రోడ్డుపై పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుళ్లు భాస్కర్, పాపాలాల్, హోమ్ గార్డ్ వెంకన్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుపై చెల్లాచెదురైన ధాన్యాన్ని వృథా కాకుండా జాగ్రత్తగా సేకరించి, తిరిగి బస్తాల్లో నింపి రైతుకు అందజేశారు.
అదే సమయంలో, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాలను నియంత్రించి, రోడ్డును శుభ్రపరిచే చర్యలు చేపట్టారు. పోలీసుల సకాలంలో స్పందనతో రాకపోకలు సజావుగా కొనసాగాయి.
ఈ సందర్భంగా రైతు భూక్యా బాలాజీ ట్రాఫిక్ పోలీసుల సేవలను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు సరుకు రవాణా సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని, రోడ్డు భద్రతా నిబంధనలను అనుసరించాలని సూచించారు.












