నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలోని కొనసముందర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు 2023-24 విద్యా సంవత్సరానికి గాను శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు.
మండల కేంద్రంలోని శివ గార్డెన్ ఫంక్షన్ హాల్లో “గెట్ టుగెదర్” పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో, పదో తరగతి చదివిన విద్యార్థిని, విద్యార్థులు ఒకే వేదికపై కలుసుకుని పాఠశాల రోజుల జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.
చాలా రోజుల తర్వాత కలుసుకోవడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. సహపంక్తి భోజనాలు నిర్వహించడంతో పాటు, మహిళలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నృత్యాలు చేసి సందడి చేశారు.
పాఠశాల రోజుల్లో జరిగిన సరదా సంఘటనలు, ఉపాధ్యాయుల బోధనలు, స్నేహితులతో గడిపిన మధుర క్షణాలను గుర్తుచేసుకుంటూ పూర్వ స్మృతులను పంచుకున్నారు.
ఈ సమ్మేళనం తమ స్నేహ బంధాలను మరింత బలపరిచేలా నిలిచిందని పాల్గొన్న వారంతా అభిప్రాయపడ్డారు. ముంబై నుంచి ప్రత్యేకంగా హాజరైన గుర్రం నరేష్ అందరినీ ఆకట్టుకున్నారు.












