ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమానికి భైంసాలో విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.
భైంసా సబ్ డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 16 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలను నేరుగా జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల, ఐపీఎస్‌కు వినిపించేందుకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. దీంతో కార్యాలయం ఫిర్యాదుదారులతో సందడిగా మారింది.
ఎస్పీ డా. జి. జానకి షర్మిల ప్రతి ఫిర్యాదుదారుని సమస్యను ఓపికగా విని, వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు విచారణ జరిపి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా పనిచేయాలని, బాధితులకు న్యాయం జరిగేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా వినేందుకు అవకాశం కల్పించినందుకు ఫిర్యాదుదారులు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.












