బీసీ దీక్షలతో కేంద్రం దిగి రావాలి..రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి: బీసీ సంఘాల జేఏసీ
బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటే
ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ధర్మ పోరాట దీక్ష
హాజరైన దత్తాత్రేయ, కోదండరాం, అద్దంకి, మధుసూదనాచారి, ఎల్ రమణ, మధు యాష్కీ, జాజుల
ముషీరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో.. బీసీ ఉద్యమం చేస్తే కేంద్రం దిగిరాక తప్పదని బీసీ సంఘాల జేఏసీ స్పష్టం చేసింది. పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం ఉధృతం చేయాలని పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షంతో వెళ్లాలని కోరింది. పార్లమెంటు వేదికగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై పోరాడడానికి రాజకీయ కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేసింది.
పోరాడకుండా బీసీలను నమ్మించి మోసం చేస్తే రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించింది. బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో రిజర్వేషన్లు ఎవరు ఇచ్చే బిక్ష కాదు.. ఇది మా హక్కు.. బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు పెంచాలని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేసి తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని ప్రధాన డిమాండ్ తో బీసీల ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బండారు దత్తాత్రేయ, కోదండరాం, అద్దంకి దయాకర్, మధుసూదనాచారి, ఎల్ రమణ మధు యాష్కీ, గుజ్జ కృష్ణ, కుందారం గణేష్ చారి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై మద్దతు పలికారు.
రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు వాటా ఇయ్యాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం న్యాయమైనదేనని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. బీసీల వాటా బీసీలకు దక్కితేనే దేశంలో అందరికీ న్యాయం జరుగుతుందని, ఈ విషయంలో ప్రధాని మోదీతో మాట్లాడుతానని తెలిపారు. బీసీ రిజర్వేషన్లతో పాటు రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు వాటా ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. బీసీల డిమాండ్ న్యాయమైనది ప్రజాస్వామ్యమైనదని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
పరిష్కరించే బాధ్యత పెద్దన్నగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుందని తెలిపారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పిస్తామని అద్దంకి దయాకర్ తెలిపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించకుండా అడ్డు తగులుతుందని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి పార్లమెంట్ వేదికగా బీసీల తరఫున పోరాడడానికి రాహుల్ గాంధీని కోరతామని మధుయాష్కీ గౌడ్ అన్నారు.
అలాగే, బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి కార్యాచరణ రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డిని, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిసి కోరతామని తెలిపారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థలకు వెళితే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ దఫా బీసీ రిజర్వేషన్లు సాధించడం కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా బీసీలు పోరాడతారని.. 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.
బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లపై.. వెనక్కి తగ్గకుండా పోరాటం నడుపుతామన్నారు. కో ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో బీసీ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో కుల్కచర్ల శ్రీనివాస్, కనకాల శ్యాంకర్మ, వీరస్వామి, ప్రొఫెసర్ బాగయ్య, మనీ మంజరి సాగర్, శ్రీనివాస్ గౌడ్, వేముల రామకృష్ణ, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు