- బాలశక్తి కార్యక్రమం పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆదేశించారు.
- విద్యార్థుల ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి.
- 52 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్న బాలశక్తి కార్యక్రమం.
నిర్మల్ : సెప్టెంబర్ 18
నిర్మల్ జిల్లాలో బాలశక్తి కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, నైపుణ్య అభివృద్ధి వంటి అంశాల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ఈ నెల 20న 52 పాఠశాలల్లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
నిర్మల్ జిల్లాలో బాలశక్తి కార్యక్రమం అమలుపై అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది. కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం 6 నుండి 12 తరగతుల విద్యార్థులకు ఆరోగ్యం, ఆర్ధిక అక్షరాస్యత, నైపుణ్యాభివృద్ధి, సాధికారత వంటి అంశాలపై అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యం. 52 పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్న ఈ కార్యక్రమంలో, విద్యార్థులను గ్రామీణ ప్రాంతాల్లోని వివిధ సదుపాయాలు, సేవలు పట్ల అవగాహన కల్పించేందుకు ఫీల్డ్ ట్రిప్స్ నిర్వహించనున్నారు. బ్యాంకింగ్, సైబర్ నేరాలు, పౌర సేవలు, ఆరోగ్య సదుపాయాలపై అవగాహన కల్పించడం, వైద్య శిబిరాల ద్వారా విద్యార్థుల హెల్త్ ప్రొఫైల్ తయారుచేయడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాలల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామీణ మండల అధికారులు, ఎన్జీవోలు, ఆశా కార్యకర్తలు భాగస్వామ్యమవుతారు. వివిధ శాఖల సమన్వయంతో బాలశక్తి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఫైజాన్ అహ్మద్ తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో డిఈఓ రవీందర్ రెడ్డి, డిఆర్డిఓ విజయలక్ష్మి, డిఎఎంహెచ్ఓ రాజేందర్, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.