బహుజనుల బిడ్డను ఆశీర్వదించాలి
సర్పంచ్ అభ్యర్థి గడ్డం గంగామణి సుభాష్ విజ్ఞప్తి
ముధోల్, మనోరంజని తెలుగు టైమ్స్ : డిసెంబర్ 15
బహుజనుల బిడ్డైన తనను ముధోల్ గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించాలని సర్పంచ్ అభ్యర్థి గడ్డం గంగామణి సుభాష్ కోరారు. సోమవారం ఎన్నికల ప్రచార చివరి రోజున గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేసి సేవకుడికి అవకాశం ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండే తనను అన్ని వర్గాల ప్రజలు ఆదరించాలని కోరారు. గతంలో ప్రజలకు నిరంతరం సేవలందించామని, ముఖ్యంగా వైద్య అవసరాల సమయంలో రాత్రి పగలు తేడా లేకుండా ప్రజలు కోరినప్పుడల్లా సహాయ సహకారాలు అందించామని గుర్తు చేశారు. తాము చేసిన సేవలకు గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వంతో పాటు పక్కరాష్ట్రం మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాజ్ భూషణ్, సమాజ్ విభూషణ్ అవార్డులు కూడా అందుకున్నట్లు తెలిపారు. ఉప సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో తక్కువ కాలంలోనే నాణ్యమైన అనేక అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి, సంక్షేమం, నిరుద్యోగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి సేవలందిస్తామని వెల్లడించారు. ముఖ్యంగా ముధోల్ గ్రామ ప్రజలకు అత్యవసరమైన ఆసుపత్రి సేవలను మెరుగుపరచడం, మౌలిక వసతుల కొరత లేకుండా చూడడం, ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామ సమస్యలను ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీర్ఘకాలిక పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించి రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో గెలిపించాలని గడ్డం గంగామణి సుభాష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.