ఖానాపూర్, జూలై 22
అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వెంటనే ఉపసంహరించుకోవాలని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) డిమాండ్ చేసింది. ఖానాపూర్ పట్టణంలో ఎన్టీఆర్ చౌరస్తాలో SKM ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ ఒప్పందాలు దేశ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని నాయకులు విమర్శించారు.
అమెరికాతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఖానాపూర్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు నందిరామయ్య, దుర్గం నూతన్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ద్వారా దేశ రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇప్పటికే పలు దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రభావం దేశీయ వ్యవసాయం, ఎగుమతి–దిగుమతులపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాతో మరో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని, దేశ రైతులు, వ్యవసాయ కార్మికుల ప్రయోజనాలను కాపాడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి నష్టం కలిగించే ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలని కోరారు.
నిరసన కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నందిరామయ్య, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్ కుమార్, జిల్లా అధ్యక్షుడు డాకూర్ తిరుపతి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి నాగెల్లి నర్సయ్య, పానుగంటి నరేష్ కుమార్, చింతలపల్లి శంకర్, చింతకుంట శంకర్, బోసు భూమన్న, జక్కుల రాజన్న, నూనె నర్సింగరావు, వడ్లగట్ల శంకర్, రాపల్లి రాజేష్, లింగాల శంకర్, గంగన్న, మచ్చ శ్రీను తదితర నాయకులు, రైతులు పాల్గొన్నారు.












