రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే నాణ్యమైన విత్తనాలను రైతులు వినియోగించేలా ప్రోత్సహించాలని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి సూచించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సమక్షంలో నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చైర్మెన్ అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం ద్వారా వారి అభివృద్ధికి విత్తన సంస్థ కృషి చేస్తుందని తెలిపారు. డీలర్లందరూ ప్రభుత్వం తయారు చేసే విత్తనాలను రైతులు సాగు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఆయన కోరారు. విత్తనాభివృద్ధి సంస్థ పంపిణీ చేసే విత్తనాలు నాణ్యతా పరంగా అత్యుత్తమమైనవని, ధర తక్కువగా ఉండటంతో పాటు దిగుబడి కూడా అధికంగా వస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ అనుమతులు లేని ప్రైవేట్ విత్తన కంపెనీలు రైతులను ప్రలోభపెట్టి, నాసిరకం విత్తనాలను అమ్ముతూ నష్టాలకు గురి చేస్తున్నాయని చైర్మెన్ ఆరోపించారు. డీలర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ నకిలీ విత్తనాలను రైతులకు అమ్మరాదని ఆయన హెచ్చరించారు. సహకార సంఘాలు, మహిళా సంఘాలు కూడా విత్తనాభివృద్ధి సంస్థ విత్తనాలను రైతులకు చేరవేయడంలో సహాయపడాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ, విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసే విత్తనాల వల్ల రైతులకు గణనీయమైన లాభాలు చేకూరుతాయని తెలిపారు. సంస్థ తయారు చేసే విత్తనాలు అనేక నాణ్యతా పరీక్షల అనంతరం మార్కెట్లోకి వస్తాయని, వీటిని సాగు చేయడం ద్వారా రైతులు అధిక దిగుబడితో పాటు మెరుగైన లాభాలను పొందవచ్చని ఆయన చెప్పారు. నకిలీ విత్తనాల బారిన పడి రైతులు నష్టపోకుండా ఉండటానికి ప్రభుత్వ విత్తనాల వినియోగం దోహదపడుతుందని ఆయన అన్నారు. విత్తన డీలర్లు అందరూ రైతులను ప్రభుత్వ విత్తనాలు వినియోగించేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.












