నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని కౌట్ల బి గ్రామ రైతు పరస్పర సహకార సంఘం సభ్యులు, తమ పంటలైన జొన్నలు, మొక్కజొన్నల కొనుగోలు కోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతూ అధికారులకు వినతి పత్రం సమర్పించారు.
రైతులు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా వ్యవసాయ అధికారి అంజి ప్రసాద్, మార్క్ ఫేడ్ డి.ఎం.లను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మండలంలో పెద్ద ఎత్తున జొన్న, మొక్కజొన్న సాగు జరుగుతోందని, పంట చేతికొచ్చినప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు దళారుల చేతిలో మోసపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు సరైన ధర పొందగలుగుతారని, తద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతారని రైతులు తెలిపారు. వెంటనే ఈ సమస్యపై స్పందించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు.
ఈ వినతి కార్యక్రమంలో మాక్స్ ప్రెసిడెంట్ సంగెం భూమారెడ్డి, డైరెక్టర్లు రామారెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, సోమిరెడ్డి, గోవింద్ రెడ్డితో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు. రైతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని వారు కోరారు.


