నిర్మల్ జిల్లాలో కొనుగోలు కేంద్రాల్లో మిగిలి ఉన్న వరి ధాన్యం సేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
జిల్లాలో ఇప్పటివరకు జరిగిన ధాన్యం కొనుగోలు పురోగతి, మిగిలి ఉన్న ధాన్యం నిల్వలు, కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోలు ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన సూచించారు.
తక్కువ పరిమాణంలో ధాన్యం మిగిలి ఉన్న కొనుగోలు కేంద్రాల్లో సేకరణను వేగవంతం చేసి, కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాల్లో అందుబాటులో ఉన్న లారీలు, హమాలీలను ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న ఇతర కేంద్రాలకు తరలించి వినియోగించుకోవాలని సూచించారు.
ధాన్యం సేకరణ, లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం కలగకుండా అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, డిఆర్డిఓ, మార్క్ఫెడ్, జిల్లా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు పాల్గొన్నారు.












