మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి మంగళవారం ఉదయం పలు రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి, ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియను పరిశీలించారు. అన్ లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లను ఆదేశించారు.
మిర్యాలగూడ శివారులోని అవంతిపురం, యాద్గార్ పల్లి, గూడూరు, వెంకటాద్రిపాలెం, తుంగపాడు, శెట్టిపాలెం పరిధిలోని రైస్ మిల్లులను ఆర్డీవో రమణారెడ్డి తన బృందంతో కలిసి తనిఖీ చేశారు. ధాన్యం అన్ లోడింగ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై ఆరా తీశారు.
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి ఆలస్యం కావడం వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోయి, ఎగుమతిలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, మిల్లుల యాజమాన్యాలతో ఆర్డీవో చర్చించి, ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రికార్డులను పరిశీలించి, ధాన్యం అన్ లోడింగ్ పనితీరుపై ఆరా తీసిన ఆర్డీవో, తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీలలో పలువురు తహసిల్దార్లు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.












