బైంసా (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 22
ముధోల్ నియోజకవర్గంలో రైతులకు పంట నిల్వ సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మహాగాం గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిలో గిడ్డంగుల నిర్మాణం చేపట్టేందుకు అధికారులు భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ విజ్ఞప్తి మేరకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
రైతులు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిన తర్వాత నిల్వ కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో, ముధోల్ నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో గిడ్డంగుల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలుమార్లు ప్రభుత్వానికి ఈ సమస్యను విన్నవించడంతో, గిడ్డంగుల నిర్మాణం కోసం ప్రభుత్వం భూ సర్వేను చేపట్టింది.
మహాగాం గ్రామంలో 10 ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండటంతో, గిడ్డంగుల సంస్థ అధికారులతో పాటు భైంసా తహసీల్దార్ భూమిని పరిశీలించారు. పది ఎకరాల విస్తీర్ణంలో గిడ్డంగుల నిర్మాణం చేపడితే ఈ ప్రాంత ప్రజలకు పంట నిల్వ ఉంచుకోవడానికి సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ దిశగా గిడ్డంగుల సంస్థ తన ప్రక్రియను ప్రారంభించింది.
ఈ సందర్భంగా మహాగాం సర్పంచ్ అప్పల రాజ్యలక్ష్మి రాకేష్ మాట్లాడుతూ, గిడ్డంగుల నిర్మాణానికి తమ దగ్గర ప్రభుత్వ భూమి ఉందని, ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తమ గ్రామంలో గిడ్డంగులు నిర్మించాలని ప్రతిపాదనలు పంపడం సంతోషంగా ఉందని తెలిపారు. గిడ్డంగుల నిర్మాణం జరిగితే రైతులకు సౌకర్యంగా ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు, గిడ్డంగుల సంస్థకు, అధికారులకు, సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.












