వరి, మొక్కజొన్న, జొన్న ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ, రైతులకు నష్టం కలగకుండా వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని సీపీఐఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు దుర్గం నూతన్ కుమార్ తెలిపారు.
ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యం కూడా నానిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన యంత్రాంగాన్ని నియమించకపోవడం, కాలయాపన చేయడం రైతులకు శాపంగా మారిందని అన్నారు.
పంట పండించడం కంటే అమ్ముకోవడంలోనే రైతులు ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ప్రభుత్వం సరైన మద్దతు ధర చెల్లించడం లేదని విమర్శించారు. పండిన ధాన్యాన్ని సమయానికి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోందని తెలిపారు. రైస్ మిల్లర్లు తరుగు పేరుతో క్వింటాల్‌కు రెండు నుంచి మూడు కేజీలు అదనంగా తూకం వేసి రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పరిస్థితులే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నాయని, పాలకులు మారినా రైతుల సమస్యల పరిష్కారంలో మాత్రం మార్పు లేదని దుర్గం నూతన్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని పటిష్టం చేసి, రైతాంగానికి నష్టం జరగకుండా కొనుగోళ్లు చేపట్టాలని, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో, సోమవారం కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించే ధర్నాను రైతులందరూ జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు డాకూర్ తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షులు బర్కుంట గంగారాం, నాయకులు పానగంటి నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.












