ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు : సీఐ యం.కృష్ణ
మనోరంజని తెలుగు టైమ్స్ సారంగాపూర్ నవంబర్ 29:
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటించాలని నిర్మల్ రూరల్ సీఐ యం. కృష్ణ సూచించారు. శనివారం స్వర్ణ గ్రామ రైతు వేదికలో సీఐ యం. కృష్ణ, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ కలిసి గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, “రేపటి నుండి రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కేంద్రంలో అభ్యర్థి తో పాటు ఇద్దరు బలపరచేవారికి మాత్రమే అనుమతి ఉంటుంది” అని చెప్పారు. ఓటర్లను ప్రలోభపెట్టే క్రమంలో డబ్బు, మద్యం పంచినట్లయితే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే విచక్షణా రహితంగా వ్యవహరిస్తామని తెలిపారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేందుకు ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో స్వర్ణ గ్రామ పెద్దలు, తండా నాయకులు, పంచాయతీ కార్యదర్శి ప్రేమలత, కానిస్టేబుళ్లు ఆకాష్, రవి, మాధవ్ పాల్గొన్నారు. తరువాత సీఐ యం. కృష్ణ రాంసింగ్ తండా వద్ద ఏర్పాటు చేసిన అంతర రాష్ట్ర చెక్‌పోస్ట్‌ను పరిశీలించి, అక్కడ విధుల్లో ఉన్న సిబ్బందికి సూచనలు అందజేశారు.