జెట్టక్కను తరిమికొట్టిన ఖానాపూర్ వాసులు..!
‘జెట్టక్క వెళ్లిపో… లక్ష్మీదేవి రా…’ అంటూ వింత ఆచారంలో గ్రామస్థుల ఉత్సాహం
మనోరంజని తెలుగు టైమ్స్
ఖానాపూర్ ప్రతినిధి, నవంబర్ 09
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వింత ఆచారం గురువారం నిర్వహించబడింది.
గ్రామంలోని చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ పాత దుస్తులు వేసుకొని, చేతుల్లో పాత చీపుర్లు, చాటలు పట్టుకుని ఒకరినొకరు కొట్టుకుంటూ ఊరేగింపుగా గ్రామ శివారు వైపు తరలి వెళ్లారు. “జెట్టక్క పో… లక్ష్మీదేవి రా…” అంటూ నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ గ్రామ పొలిమేరల వరకు ర్యాలీగా వెళ్లిన ప్రజలు జెట్టక్కను తరిమికొట్టారు. ఈ ఆచారం వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే — గ్రామానికి పట్టిన దుష్టశక్తులు, వ్యాధులు, కష్టాలు తొలగిపోతాయని… లక్ష్మీదేవి కటాక్షంతో సుఖశాంతులు నెలకొంటాయని విశ్వాసం. ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం ఈ వింత ఆచారాన్ని పాటించడం ఖానాపూర్ ప్రజల ప్రత్యేక సంప్రదాయంగా మారింది. గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, దుష్టశక్తులు దూరం కావాలని కోరుకుంటూ జెట్టక్కను తరిమికొట్టిన ఖానాపూర్ వాసులు..!