భారత వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం
సహజ మరణం తర్వాత అవయవదానం – వైద్యరంగంలో చారిత్రక ఘట్టం
మనోరంజని తెలుగు టైమ్స్ | ఢిల్లీ ప్రతినిధి | నవంబర్ 09
భారత వైద్య రంగంలో మరో చరిత్ర సృష్టించబడింది. దేశంలోనే తొలిసారిగా సహజ మరణం పొందిన వ్యక్తి నుంచి అవయవాలను విజయవంతంగా సేకరించి వైద్యులు ఘనత సాధించారు. ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రి వైద్య బృందం ఈ అరుదైన విజయాన్ని సాధించి అవయవదాన చరిత్రలో కొత్త పుటను రాసింది.
సాధారణంగా మన దేశంలో బ్రెయిన్‌డెడ్ వ్యక్తుల నుంచే అవయవాలను సేకరించే అవకాశం ఉంటుంది. కానీ ఈసారి వైద్యులు ‘నార్మోథెర్మిక్ రీజనల్ పర్ఫ్యూజన్’ అనే ప్రత్యేక వైద్య ప్రక్రియను వినియోగించి సహజ మరణం తర్వాత అవయవాలను సేకరించారు.
మోటార్ న్యూరాన్ వ్యాధితో బాధపడుతున్న 55 ఏళ్ల గీతా చావ్లా, అవయవదానానికి ముందుగానే తన సంసిద్ధతను వ్యక్తం చేశారు. నవంబర్ 6వ తేదీ రాత్రి 8.43 గంటలకు ఆమె గుండె ఆగిపోవడంతో సహజ మరణం సంభవించింది. చట్టపరమైన ప్రక్రియ ప్రకారం ఐదు నిమిషాల తర్వాత వైద్యులు ప్రత్యేక పద్ధతిలో పంప్ ద్వారా ఆమె పొత్తికడుపు భాగానికి రక్తప్రసరణను కృత్రిమంగా పునరుద్ధరించారు.
దీని ఫలితంగా కాలేయం, కిడ్నీలు పాడవకుండా సజీవంగా ఉంచి విజయవంతంగా సేకరించారు. ఆ అవయవాలను అనంతరం అవసరమైన రోగులకు మార్పిడి చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ విధానం గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్నప్పటికీ, భారతదేశంలో ఇదే తొలి ప్రయత్నం. ఈ విజయం దేశంలో అవయవాల కొరతను అధిగమించడంలో కీలక పాత్ర పోషించనుంది.
గీతా చావ్లా తీసుకున్న స్ఫూర్తిదాయక నిర్ణయం, ఢిల్లీ మణిపాల్ వైద్యుల నైపుణ్యం — రెండూ కలసి భారత వైద్య చరిత్రలో చిరస్మరణీయ ఘట్టంగా నిలిచాయి.