ప్రాచీన దేవాలయాల గుర్తింపు… శుభ్రపరిచే ఐక్యత సేవా సమితి సేవలు ప్రశంసనీయం
లోకేశ్వరం మండలంలో పురాతన హనుమాన్ విగ్రహం వెలుగులోకి
లోకేశ్వరం, మనోరంజని తెలుగు టైమ్స్: నవంబర్ 25
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం కనకాపూర్ గ్రామ పరిసరాల్లో ఉన్న అతి ప్రాచీన పాండ్రి హనుమాన్ ఆలయాన్ని ఐక్యత సేవా సమితి బృందం గుర్తించి శుభ్రపరిచింది. ఎన్నో సంవత్సరాలుగా ముళ్లపొదలతో కప్పబడి ఉన్న ఈ ఆలయాన్ని స్వచ్ఛం చేసి, ఆంజనేయ స్వామికి నీళ్లతో అభిషేకం చేసి, చందనం సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన దేవాలయాలను గుర్తించడం, వాటి వద్దకు చేరుకోవడం, శుభ్రపరిచడం చిన్న పని కాదని స్థానికులు అభిప్రాయపడ్డారు. యుగాల చరిత్ర ఉన్న ఆలయాలు గ్రామాల్లో ఉన్నప్పటికీ వాటిని గుర్తించడానికి ముందుకొచ్చే వారు కొరతగా ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఐక్యత సేవా సమితి బృందం ఎక్కడ ప్రాచీన విగ్రహాలు ఉన్నాయో అక్కడికి వెళ్లి వాటిని వెలికితీసి, భక్తులు దర్శించుకునేలా మారుస్తుండడం అభినందనీయమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగునపడ్డ దేవాలయాలు, పురాతన దైవ విగ్రహాలను గుర్తించి శుద్ధి చేసి భక్తులకు కనువిప్పు చేస్తున్న ఐక్యత సేవా సమితి సేవలు అమోఘమని గ్రామస్థులు ప్రశంసిస్తున్నారు.